నరసాపురం, 2 ఆగస్టు (హి.స.)
,:లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.2.50 లక్షల పింఛను సొమ్మును ఓ వీఆర్వో తన బైక్ డిక్కీలో పెట్టగా ఆగంతకులు కొట్టేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుడు, ఐదో వార్డు సచివాలయ వీఆర్వో లక్ష్మీగణపతి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. గురువారం మునిసిపల్ అధికారుల నుంచి పింఛన్ల సొమ్ము రూ.2.50 లక్షల నగదును తీసుకున్నారు. ఆ సొమ్మును శుక్రవారం పంపి ణీ చేయాల్సి ఉండగా, బైక్ డిక్కీలో పెట్టుకుని, పట్టణంలోని తెలగా కళ్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల వివాహానికి వెళ్లారు. రాత్రి ఇంటికి వెళ్లి చూసే సరికి బైక్ డిక్కీలో సొమ్ము లేదు. వెంటనే అధికారులకు తెలియజేశాడు. తోటి రెవెన్యూ సిబ్బంది అప్పటికప్పుడు చందాలుగా వేసుకుని రూ. 2.50లక్షలు పోగు చేశారు. ఆ మొత్తాన్ని వీఆర్వో శుక్రవారం లబ్ధిదారులందరికీ పంపిణీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయలక్ష్మి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ