అడ్డతీగల, 2 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఏపీ(Andhra Pradesh)లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం లోని చినమునకనగడ్డ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉంది. ఈ క్రమంలోనే పాఠశాల భవనం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి కూలిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఎంఈవో శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని.. పరిశీలించారు.
ఈ క్రమంలో రాత్రి సమయంలో భవనం కూలడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు పేర్కొన్నారు. పదేళ్లుగా శిథిలంగా ఉండటంతో పక్కనే ఉన్న మరో గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన పై స్పందించిన ఎంఈవో శ్రీనివాసరావు ఇప్పటికే భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, తర్వలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి