దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.)పహల్గాం దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై పెద్దఎత్తున దాడులకు దిగుతున్నాయి. వరుస ఆపరేషన్లతో వారిని మట్టుబెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘ఆపరేషన్ అఖాల్ (Operation Akhal)’ పేరుతో జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir Encounter)లోని కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్ నిర్వహించాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం దక్షిణ కశ్మీర్ జిల్లా అఖాల్‌లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. వీటికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈక్రమంలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ