హైదరాబాద్, 3 ఆగస్టు (హి.స.)
భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానిది కీలక పాత్ర అని అటువంటి చేనేత పరిశ్రమకు దురదృష్టవశాత్తు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా నేడు మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో చేనేత కార్మికులు విశేష పాత్ర పోషిస్తున్నారన్నారు. చేనేత రంగంపై ఆధారపడి సుమారు 5 కోట్ల మంది జీవిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మన దేశంలోని చేనేత ఉత్పత్తుల ఎంతో నైపుణ్యంతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేనేత రంగం అభివృద్ధి కోసం ఫ్యాబ్రిక్, ఫ్యాషన్, ఫిలియేషన్, ఫైనాన్స్, ఫెసిలిటేషన్ అనే ఫైవ్ 'ఎఫ్' స్ట్రాటజీని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్