మహబూబాబాద్, 3 ఆగస్టు (హి.స.)
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మహబూబా జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సెల్ టవర్ ఎక్కారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
విషయం తెలుసుకున్న స్థానికులు సెల్ టవర్ దిగాలని, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని తెలిపినప్పటికీ రాములు సెల్ టవర్ పైనుంచి దిగకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితునికి హామీ ఇచ్చినప్పటికీ.. అతడు కిందికి దిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రనాయక్కు విషయం తెలియజేశారు. దీంతో ఇల్లు వచ్చే విధంగా చూస్తానని బాధితుని భార్యకు ఫోన్లో ఆయన హామీ ఇవ్వడంతో రాములు సెల్ టవర్ దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..