తెలంగాణ, హనుమకొండ. 8 ఆగస్టు (హి.స.)
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తోడు
దొంగలుగా మారి ఢిల్లీ లో బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో 564 మంది లబ్ధిదారులకు కాళోజీ కళాక్షేత్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టు పట్టిపోయాయని అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ మళ్లీ తమపైనే ఎదురుదాడి చేస్తోందని కామెంట్ చేశారు.
కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ చంద్రఘోస్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుబడుతున్నారని పొంగులేటి ఫైర్ అయ్యారు. ఇక దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి.. అందుకు అనుగుణంగా బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలుగా మరి ఆ బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కాంగ్రస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని.. ప్రజలకు బీసీ రిజర్వేషన్లపై జరగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమినించాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు