గార్లదిన్నె, 9 ఆగస్టు (హి.స.)
గార్లదిన్నె మండలంలోని కల్లూరు సమీపంలో ఎర్రమట్టి తరలింపు వివాదాస్పదంగా మారింది. ఎర్రమట్టిని తరలిస్తున్న తెదేపా కార్యకర్తలను అడ్డుకొన్న రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం రాత్రి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆర్డీవో కేశవనాయుడుకు సమాచారం అందడంతో తహసీల్దారు ఈరమ్మకు పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. ఆమె వీఆర్‌ఏ నాగరాజు, వీఆర్వో రవికాంత్‌లను పురమాయించడంతో వారు ఘటనా ప్రదేశానికి వెళ్లి టిప్పర్లకు సంబంధించిన తాళాలు తీసుకున్నారు. ఆవెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌కు బయలుదేరారు. ఈక్రమంలో వీరిని కల్లూరు రైల్వే వంతెన వద్ద తెదేపా కార్యకర్తలైన మధు, రామాంజినేయులు, వీరేశ్, శేషయ్య, నరసింహులు అడ్డుకొని టిప్పర్ తాళాలు తీసుకొనే ప్రయత్నంలో దాడి చేశారు. దీనిపై బాధితులు తహసీల్దారు ఈరమ్మకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గౌస్‌బాషా, పోలీసు సిబ్బంది టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఎస్సై తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ