హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
సంతానం లేని దంపతులే లక్ష్యంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముప్పేట మోసాలకు తెగబడినట్టు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. ఐదో రోజు పోలీసు కస్టడీలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు సేకరించినట్టు సమాచారం. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టిపై నమోదైన తొమ్మిది కేసుల్లో గోపాలపురం పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సంజయ్ కోసం గాలిస్తున్నారు. ఐవీఎఫ్, సరోగసీ చికిత్సతో కన్నబిడ్డల్ని ఎత్తుకోవాలనే దంపతుల ఆశను డాక్టర్ నమ్రత తెలివిగా సొమ్ము చేసుకుంటూ వచ్చారు. గతంలో ఆమె పలుమార్లు జైలుకెళ్లినా.. విడుదల కాగానే ఇతరుల పేర్లతో క్లినిక్‌లు ప్రారంభించి పెద్దఎత్తున దందా సాగించారు. ఏపీ, తెలంగాణల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత కన్సల్టింగ్ పేరుతో సంతానం లేని దంపతులను ఆకట్టుకున్నారు. అక్కడకు వచ్చిన వారిని వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ రప్పించారు. ఇక్కడ ఐవీఎఫ్ చికిత్స అందించి ఫలితం లేదని సరోగసీ పేరుతో విశాఖపట్నం పంపారు. అక్కడి మేనేజర్ కల్యాణి వీరితో బేరసారాలు సాగించి సరోగసీ బిడ్డకు రూ.30-60 లక్షలు వసూలు చేసేది. అప్పటికే ఏజెంట్ల ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణులకు రూ.1-4 లక్షలు ఆశచూపి పుట్టబోయే శిశువులను తమకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకునేవారు. వారికి పుట్టిన బిడ్డలను సరోగసీ పిల్లలేంటూ దంపతులకు అప్పగించేవారు. రెండో తరహా మోసం సరోగసీ చికిత్స పేరుతో డబ్బు తీసుకొని అద్దె గర్భంలోనే బిడ్డ చనిపోయాడంటూ వసూలుచేసిన సొమ్ము తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసేవారు. సరోగసీ కోసం ఇప్పటికే వందలాది మంది రూ.లక్షలు చెల్లించినా.. వారికి పిల్లల్ని ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారిని ఇలా మూడు రకాలుగా మోసగించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇవే అంశాలను డాక్టర్ నమ్రత విచారణలో పోలీసుల ఎదుట అంగీకరించినట్టు సమాచారం. కొన్ని విషయాలు మాత్రమే గుర్తున్నాయంటూ పూర్తి వివరాలు వెల్లడించలేదని తెలిసింది. నిందితురాలి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు రెండోసారి మరో ఐదురోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ