హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్ కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
గ్రామ పంచాయతీ బిల్డింగ్ మొదలుకొని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..