హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే రక్షణ దళం ప్రయాణీకులకు సేవలను అందించే దిశలో భాగంగా 'ఆపరేషన్ అమానత్' కింద కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనుగొని తిరిగి పొందడానికి డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీ.ఈ.ఐ.ఆర్) పోర్టల్ ద్వారా, ఆర్.పి.ఎఫ్ సైబర్ సెల్ జోన్ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పష్టమైన ఫలితాలు పొందే చర్యల్లో భాగంగా రికవరీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రైలు మదద్ ద్వారా కంప్లయింట్ నమోదు చేసినప్పుడు మాత్రమే కోల్పోయిన పరికరాలను రికవరీ చేయడానికి ఆర్పీఎఫ్ కు అధికారం ఉంది మరియు దీని ద్వారా ఫిర్యాదుదారు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేరు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేసిన సీ.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా ఐ.ఎం.ఈ.ఐ ఆధారిత ట్రాకింగ్, పోయిన లేదా దొంగిలించబడిన మొబైలు పరికరాలను బ్లాక్ చేయడానికి వీలవుతుంది. అయితే ఆర్పీఎఫ్ ప్రత్యేక సైబర్ సెల్ జోన్ వ్యాప్తంగా రికవరీ ఆపరేషన్లను చేపడుతున్నది. ఆర్.పి.ఎఫ్ సైబర్ సెల్ జూలై-2025 మాసంలో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు నాందేడ్ డివిజన్ల నుండి వచ్చిన మొత్తం 169 ఫిర్యాదులను అందుకుంది.
ఈ ఫిర్యాదులలో, సైబర్ సెల్ 139 మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసింది, 52 పరికరాల జాడను గుర్తించడం జరిగింది మరియు 21 మొబైల్ ఫోన్‌లను విజయవంతంగా స్వాధీనం చేసుకొని , వాటిలో 09 ఫోన్‌లను ఇప్పటికే యజమానులకు తిరిగి అందించడం జరిగింది. వినియోగదారుల ప్రత్యక్ష మద్దతు ద్వారా ఈ చర్యలు సత్ఫలితాలనునిస్తూన్నడం ఆర్పీఎఫ్ యొక్క చురుకైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైలు ప్రయాణికులకు సేవ చేయడంలో దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే రక్షణ దళం చేస్తున్న కృషి మరియు అంకితభావాన్ని ప్రశంసించారు. డిజిటల్ ఇంటెలిజెన్స్, సకాలంలో చర్య మరియు ఇంటర్-ఏజెన్సీ సహకారం ద్వారా దొంగిలించబడిన లేదా పోయిన ఆస్తులను తిరిగి పొందడంలో ఆర్.పి.ఎఫ్ సైబర్ సెల్ కీలక శక్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ చొరవ రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా భద్రత మరియు సేవలను నిర్ధారించడంలో ఆర్‌పిఎఫ్ నిబద్ధతపై ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తూనే ఉందని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు