హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో హిమాయత్సాగర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు వెళ్తున్నది. ముందు జాగ్రత్తగా అధికారులు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్సాగర్ వైపు రాకపోకలు నిలిపివేశారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పోటెత్తింది.దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1763.1 అడుగులుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్