హైదరాబాద్ 10 సెప్టెంబర్ (హి.స.)నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షింస్తున్నారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగింది. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నెంబర్ ఏర్పాటుచేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో మంత్రి సమన్వయం చేస్తున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడంపై కార్యాచరణ ప్రారంభించారు.
నేపాల్ లో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేయడం జరుగుతోంది.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో అధికారులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ భవన్ అధికారులతో మంత్రి మాట్లాడారు. నేపాల్‌లో 215 తెలుగువారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం. కొందరితో వీడియో కాల్‌లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో అందరినీ సురక్షితంగా తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి.. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి