విశాఖపట్నం,, 10 సెప్టెంబర్ (హి.స.) :ప్రముఖ ప్రవచన కర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. విశాఖ నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవాల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిఽథిగా హాజరై చాగంటికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ పంచభూతాలు ఉన్నంతకాలం మన మాతృభాష తెలుగు వెలుగొందాలని ఆకాంక్షించారు. తెలుగువారికి ఆధ్యాత్మికత, సంస్కృతి, క్రమశిక్షణతో కూడిన మూలాలను ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ, జాతిని జాగృతం చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు కొప్పరపు కవుల కళాపీఠం ప్రతిభా పురస్కారానికి అన్ని విధాలా అర్హులని కొనియాడారు. పురస్కార గ్రహీత చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కొప్పరపు కవుల వంటి సరస్వతీ ఉపాసకుల పేరిట నెలకొల్పిన విశిష్ట పురస్కారం తనకు లభించడం భగవంతుని కృప అన్నారు. అవధానికి కేవలం భాష మీద పట్టుంటే చాలదని, సకల శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలపైనా పట్టు ఉండాలని తెలిపారు. అతిథులుగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, కాలిఫోర్నియాకు చెందిన లిపి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి సాగర్ అని సింగరాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ