హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తింది. దీంతో ఇన్ఫ్ల భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం (ఫుల్ ట్యాంక్ లెవెల్) 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.30 అడుగుల వరకు చేరింది. జలాశయానికి గంట గంటకూ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, అధికారులు నాలుగు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 1352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1763.15 అడుగులకు చేరింది. ఈ జలాశయానికి 5000 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు రెండు గేట్లు నాలుగు అడుగుల మేర, మరో గేటు ఒక అడుగు మేర ఎత్తి మొత్తం 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ఉదృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో అధికారులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గేట్లను మరింతగా తెరిచి నీటి విడుదలను పెంచనున్నారు. ఉస్మాన్ సాగర్ నుండి 2400 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుండి 5600 క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలే అవకాశం ఉందని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు