అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
తిరుపతి: తిరుపతిని యాంకర్ హబ్‌గా చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్‌లో మంత్రి దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం, పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను తెలియజేశారు. ఇన్వెస్టర్స్, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో మంత్రి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే దాదాపు రూ.12,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు సాధించామంటే ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం స్పష్టమవుతోందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ