ముంబయి,19, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో నిన్న సూచీలు రాణించిన సంగతి తెలిసిందే. అయితే మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 327 పాయింట్ల నష్టంతో 82,683 వద్ద ఉండగా.. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 25,339 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.22గా ఉంది.
నిఫ్టీ సూచీలో శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్, హీరో మోటార్‌కార్ప్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అదానీ గ్రూప్ (Adani Group) అధిపతి గౌతమ్ అదానీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లిన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు పలు అవకతవకలకు పాల్పడ్డారంటూ అదానీ, ఆయన గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లభించలేదని వెల్లడించింది. ఈ ప్రకటనతో అదానీ సంస్థ షేర్లు దూసుకెళ్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ