న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.)
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు. ఆ చర్య అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తుందని వ్యాఖ్యానించారు.
‘‘ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు యూఎస్ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుంది. భారతదేశాన్ని టర్బోఛార్జ్ చేస్తుంది. ప్రపంచస్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్, పుణె, గుర్గావ్‌లకు వచ్చేస్తాయి. దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వికసిత్ భారత్ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది. ఆమెరికాకు నష్టం కలిగించే ఈ నిర్ణయం భారత్‌కు లాభం చేకూర్చనుంది’’ అని అమితాబ్‌కాంత్ (Former NITI Aayog CEO Amitabh Kant) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మన దేశానికి మేలు చేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు