తెలంగాణ, ములుగు. 22 సెప్టెంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారం రానున్న నేపథ్యంలో పనుల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం చేరుకున్న మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ లతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
రేపు సీఎం మేడారం పర్యటన దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు 200 మంది పోలీసులను మేడారం పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కోసం నియమించగా ప్రత్యేక పోలీసు బలగాలు దట్టమైన అటవీ ప్రాంతంలో అడుగడుగున జల్లెడ పడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో నిత్యం మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరుగుతున్న సందర్భంలో పరిస్థితుల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం తో పాటు ఇతర జిల్లాల పోలీసులు మేడారంలో తిష్ట వేశారు.రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదివారం నుంచి మేడారంలో ఉంటూ పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు