హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్కు ఓటేస్తే మన ఇండ్లను కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ బూత్ స్థాయి సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. మాట్లాడుతూ పేద ఇండ్లను రేవంత్రెడ్డి ఆదివారమే ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. గాజులరామారంలో కోర్టు సెలవు రోజులు చూసుకొని మరీ పేదల ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. ఇవాళ గాజులరామారం.. రేపు జూబ్లీహిల్స్ లోని బోరబండ బస్తీకి సైతం హైడ్రా పేరుతో వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఇళ్లు కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లేనన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారని.. కాంగ్రెస్ కూల్చిన ఇళ్లను మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. హైడ్రా బుల్డోజర్ పేదల ఇండ్లపైకే వెళ్తుందని.. పెద్దల ఇండ్లకు వెళ్లదని విమర్శించారు. సీఎం సోదరుడు, మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు.. ప్రభుత్వ స్థలాల్లో, చెరువులపైన ఇండ్లు కట్టుకున్నా హైడ్రా కూల్చివేయలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు