మహబూబ్నగర్, 22 సెప్టెంబర్ (హి.స.)
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారి రెయిన్ బో హోటల్ సమీపములో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు మృతి చెందారు.. వనపర్తి జిల్లాలోని పాన్ గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి (35) అతని కుటుంబ సభ్యులు పెద్దల పండుగ నిమిత్తం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి వచ్చారు. ఆదివారం పెద్దల పండుగ ముగించుకున్నారు. ఆయన మరదలు (భార్య సోదరి) హారిక (25) కు బెంగళూరులో జాబ్ రావడం.. ఆమె సోమవారం ఆ జాబులో జైన్ కావాల్సి ఉండడంతో ఫ్లైట్ ఎక్కించడానికి హైదరాబాద్ బయలుదేరారు.
రాజాపూర్ సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు అతివేగంగా వస్తున్న మరో కారు అదుపుతప్పి డివైడర్ను దాటి రంజిత్ రెడ్డి, హారిక ప్రయాణిస్తున్న కారుపై అత్యంత బలంగా పడింది. దీంతో కారులో ఉన్న రంజిత్ కుమార్ రెడ్డి, హారిక అక్కడికి అక్కడే మరణించారు. స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను అంబులెన్స్లో పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..