హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నేడు. ఈ క్రమంలోనే ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆమె చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా చాకలి ఐలమ్మకు నివాళులర్పిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారు ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని అన్నారు.. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు