అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం: నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ )లో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రెండో రోజూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు విద్యార్థులతో వీసీ రాజశేఖర్ చర్చలు జరిపారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏయూలోని శాతవాహన వసతిగృహంలో ఉంటున్న విద్యార్థి మణికంఠ గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఏయూ డిస్పెన్సరీ విభాగంలో సరైన సౌకర్యాలు లేక మృతి చెందాడని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నేడూ ఆందోళన కొనసాగించడంతో వీసీ వారితో చర్చలు జరిపారు. పోలీసులను వెనక్కి పంపాలని.. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ