అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ... శాసనసభలో బిల్లుకు ఆమోదం
అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ''ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి'' (IIULER) ఏర్పాటుకు శాసనసభ ఆమోదం తెలిప
లోకేశ్‌


అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక 'ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి' (IIULER) ఏర్పాటుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో, రాష్ట్రానికి మరిన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు వీలుగా నిబంధనలను సరళీకరిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. శుక్రవారం శాసనసభలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు IIULER ను మంజూరు చేయించారు. ఇందుకు శాసనసభ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి 55 ఎకరాల భూమిని చదరపు మీటర్‌కు రూపాయి నామమాత్రపు లీజుపై కేటాయించామని వివరించారు. ఈ విశ్వవిద్యాలయం కేవలం న్యాయ విద్యకే పరిమితం కాకుండా, పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత స్థాయి పరిశోధనలకు ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande