అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)నటుడు మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్‌గా భావించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ భక్తిరస చిత్రం తాజాగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండటం విశేషం.
ఈ సినిమాను మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ, ఆయన తండ్రి మోహన్ బాబు నిర్మించారు. ఇందులో పాన్-ఇండియా స్థాయికి చెందిన భారీ తారాగణం నటించింది. ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. కథానాయికగా ప్రీతి ముకుందన్ నటించగా, మోహన్ బాబు మహదేవశాస్త్రి అనే ప్రత్యేక పాత్రలో కనిపించారు.
కథ విషయానికొస్తే, దేవుడంటే నమ్మకం లేని బోయవాడైన తిన్నడు (మంచు విష్ణు) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మూఢనమ్మకాలను వ్యతిరేకించే అతడు, పరమ శివభక్తురాలైన నెమలి (ప్రీతి ముకుందన్)ని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో తన గూడెం నుంచి బహిష్కరణకు గురైన తిన్నడు, అడవిలో రహస్యంగా ఉన్న వాయులింగాన్ని ఎలా చేరుకున్నాడు? అసలు దేవుడినే ప్రశ్నించే తిన్నడు, గొప్ప శివభక్తుడైన కన్నప్పగా ఎలా మారాడు? అనేదే ఈ చిత్రం మూలకథ.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి