హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
ట్యాంక్ బండ్ పై గణపతుల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. డప్పు సప్పులతో, కళాకారుల నృత్యాలతో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, మింట్ కాంపౌండ్ లిబర్టీ, లకిడికపూల్లో భక్తులు గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ నినాదాలు మార్మోగిపోతున్నాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్ కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సచివాలయం వైపు వాహనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వాహనాలు స్లోగా నడుస్తున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు, తదితర ప్రాంతాల్లో పదిహేను క్రేన్లు,కంట్రోల్ రూమ్లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, తదితర సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు