శ్రీకాకుళం, 5 సెప్టెంబర్ (హి.స.)
: జిల్లా నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పీవీ పార్వతీశ్వర గుప్తా హత్యకు గురయ్యారు. గత నెల 26న అదృశ్యమైన ఆయన.. శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. శ్రీకాకుళంలోని రామిగడ్డ కాల్వలో పార్వతీశ్వర గుప్తా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలోని లచ్చుమన్నపేట వీధికి చెందిన పార్వతీశ్వర గుప్తా గత నెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కనిపించలేదు. నరసన్నపేటలోని బంగారు దుకాణాలకు బంగారం బిస్కెట్లు సరఫరా చేసే గుప్తా.. తన కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి రాకపోవడంతో గత నెల 30న అతడి సోదరుడు మన్మథరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. పార్వతీశ్వర గుప్తాను కారు డ్రైవర్ సంతోష్‌తో పాటు శ్రీకాకుళం పెదపాడు సమీపంలోని కార్ డెకార్స్ యజమాని హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. రెండు రోజులుగా శ్రీకాకుళం సమీపంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రామలక్ష్మణ కూడలి సమీపంలోని రామిగడ్డ కాల్వలో పార్వతీశ్వర గుప్తా మృతదేహాన్ని గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ