అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా నిల్వలు, పంపిణీ, సరఫరాపై కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా పంపిణీలో సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు అధిగమించాలన్నారు. భవిష్యత్ అవసరాల కోసం రబీ సీజన్‌కు 9.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
అధికారిక లెక్కలకు, గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న యూరియా నిల్వలకు తేడా లేకుండా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఉన్న యూరియా నిల్వల గురించిన వివరాలను అత్యవసరంగా అందజేయాలని కలెక్టర్లను కోరారు. కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయని వీటిపై త్వరితగతిన స్పందించి కలెక్టర్లు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. గంగవరం, కాకినాడ పోర్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన 53 వేల మెట్రిక్ టన్నుల యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే విధంగా పోర్ట్ అధికారులు, రైల్వే అధికారులతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి యూరియా అందే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ