మార్టూరు, 5 సెప్టెంబర్ (హి.స.)
: అమెరికాలో బాపట్ల జిల్లా మార్టూరు యువకుడు ప్రమాదవశాత్తు ఈత కొలనులో దిగి మృత్యువాత పడిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి పి. వేణుబాబు కుమారుడు పాటిబండ్ల లోకేశ్ (23) కొన్నాళ్లుగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు బంధువులు వెల్లడించారు. ఎంఎస్ పూర్తయిన తరువాత ఉద్యోగం సాధించి, ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్నాడు. గురువారం రాత్రి మార్టూరులోని కుటుంబ సభ్యులకు లోకేశ్ ఈత కొలనులో పడి మృతిచెందినట్లు సమాచారం అందింది. ఈనెల 3న ఈతకు వెళ్లాడని సమాచారం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. లోకేశ్‌కి ఈత వచ్చన్నారు. సమీప బంధువులు బోస్టన్‌లో ఉంటున్నారని చెప్పారు. మృతదేహాన్ని మార్టూరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, మృతుడికి డిగ్రీ పూర్తిచేసిన సోదరుడు ఉన్నారు. లోకేశ్ మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు, గ్రానైట్ యజమానులు పెద్దసంఖ్యలో వేణుబాబు ఇంటికి చేరుకుని పరామర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ