తాడిపత్రి , 6 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత గడ్డపై అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు.
గత కొంతకాలంగా తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేతిరెడ్డి పట్టణంలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై ఆయన తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు. విచారణ అనంతరం, ఆయన తాడిపత్రి వెళ్లేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి నిచ్చింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఉదయం తిమ్మంపల్లిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రికి బయలుదేరారు. ఐదు వాహనాలు, 40 మంది అనుచరులతో కూడిన కాన్వాయ్‌తో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 నెలల తర్వాత తాడిపత్రికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నాకు భద్రత కల్పించారు. వారికి అన్ని విధాలా సహకరిస్తాను. తాడిపత్రి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని కేతిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన రాకతో తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి