ఢిల్లీ, 6 సెప్టెంబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు మోదీని గొప్ప ప్రధానమంత్రి అంటూ ప్రశంసించిన ఆయన, అదే సమయంలో ఆయన తీసుకుంటున్న కొన్ని చర్యల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హుందాగా స్పందించారు.
వివరాల్లోకి వెళితే, భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మా మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ప్రధాని మోదీతో నా స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అయితే, మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను, రెండు దేశాల మధ్య సంబంధాల పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా దేశాలు ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తున్నాయని, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ, అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి