న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.)బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (NIRAV Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ (India) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే (UK)కు చెందిన అధికారులు ఇటీవల దిల్లీలోని తిహాడ్ జైలు (Tihar Jail)ను పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. జులైలో బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) బృందం తిహాడ్ జైలును పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. జైలులో భద్రత, ఖైదీలకు అందించే సౌకర్యాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జైలులోని కొంతమంది ఖైదీలతో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తిహాడ్ జైలులో సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నట్లు బ్రిటన్ అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. అవసరమైతే, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని జైలు అధికారులు వారికి వివరించినట్లు తెలిసింది. ఖైదీల భద్రతకు సంబంధించి భారత్ నుంచి లిఖిత పూర్వక హామీని కూడా యూకే అధికారులు కోరినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ