
అమరావతి, 12 జనవరి (హి.స.)నందిగామ, ప్రవాహంలా వస్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కళకళలాడింది. కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల్లో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు 46 వేల వాహనాలు వచ్చినట్లు నమోదైంది. సాధారణంగా విజయవాడ వైపు రోజుకు 10-12వేల వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో మరో 34 వేల వాహనాలు వచ్చాయి. నందిగామ వై.జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. ఇక్కడ గుంతల కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచన మేరకు నందిగామకు చెందిన నాయకుడు పాలేటి సతీష్ గుంతలకు మరమ్మతులు చేయించారు. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు స్పీడ్‌బ్రేకర్లు లేకుండా చేశారు. గుత్తేదారు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు విజయవాడ వైపు సర్వీసురోడ్డులో గుంతలకు మరమ్మతులు చేయించారు. దీంతో విజయవాడ వైపు వాహనాలు ఇబ్బంది లేకుండా వెళ్తున్నాయి. పండగ అనంతరం హైదరాబాద్ వైపు తిరిగివెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా వంతెనకు పైభాగంలో, నందిగామ వై.జంక్షన్ వద్ద తాత్కాలికంగా పనులు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ