
నగరి, 14 జనవరి (హి.స.)
నగరిలో (Nagari) సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. మాజీ మంత్రి రోజా (RK Roja) ఇంటి సంబరాల్లో భాగంగా బుధవారం భోగి మంటలను వేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫ్రీ ఫ్రీ అని చెప్పే ఫ్రీ మాటలను నమ్మవద్దని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చెప్పిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాలన కారణంగా ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా రైతులు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ సంక్రాంతి అని అన్నారు. కానీ 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కొందరు రైతులకు 10 వేల రూపాయలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని సంతోషంగా నమ్మిన వ్యక్తులు నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు వైయస్ జగన్ మాత్రమేనన్నారు.
నాలుగు సార్లు సీఎంగా చేసినా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు తీసుకురాలేదని ఆరోపణలు గుప్పించారు. కానీ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV