
విశాఖపట్నం, 14 జనవరి (హి.స.)
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా రన్‌వేపై విజిబిలిటీ (Visibility) గణనీయంగా తగ్గడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రెండు విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు విమానాల ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
దారి మళ్లించిన విమానాల వివరాల్లోకి వెళ్తే.. అబుదాబి నుంచి విశాఖకు రావాల్సిన అంతర్జాతీయ విమానం పొగమంచు కారణంగా ల్యాండ్ కావడానికి వీలుపడలేదు. దీంతో ఆ విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోవాల్సిన ఇండిగో విమానాన్ని గన్నవరం (Vijayawada) విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం కుదుటపడిన తర్వాత తిరిగి విమాన సేవలు పునరుద్ధరిస్తామని, ప్రయాణికులు సహకరించాలని విమానయాన సంస్థల ప్రతినిధులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV