
తిరుపతి, 14 జనవరి (హి.స.)
పవిత్రమైన ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ గోదా కల్యాణం (Goda Devi Kalyanam) జరగనుంది. అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల మైదానంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనుందని పేర్కొంది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి, అర్చకస్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారని వెల్లడించింది.
అధికారులు మాట్లాడుతూ ఈ వేడుకలో భాగంగా ఆధ్యాత్మికతను పంచేలా ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే 'గోదా కల్యాణం' నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారని తెలిపారు. గోదాదేవి శ్రీరంగనాథునిపై పెంచుకున్న భక్తిని చాటిచెప్పే ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించనుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV