
అమరావతి, 14 జనవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటలు, రంగవల్లులు, రామదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలతో పాటు చాలా వరకు పల్లెల్లో ఎటు చూసినా కోడి పందాల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సందడి మరింత ఎక్కువగా ఉంది. భోగి పండుగతోనే ప్రారంభమైన ఈ పందాల కోసం నిర్వాహకులు ఎకరాల విస్తీర్ణంలో భారీ 'బరులను' (Arenas) సిద్ధం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి వచ్చే ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక విఐపి గ్యాలరీలు, ఏసీ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తూ, వాటికి కత్తులు కట్టి బరిలోకి దించుతుండటంతో పల్లెల్లో కోడి పందాల హడావుడి నెలకొంది.
ఈ ఏడాది కోడి పందాల వ్యాపారం ఊహించని రీతిలో సాగుతోందని తెలుస్తోంది. ఒక్కో బరి వద్ద లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లు (Betting) జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ పోటీల్లో మేలు రకం జాతి కోళ్లైన నెమలి, డేగ, కాకి, రసంగి వంటి పుంజులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పందెం రాయుళ్ల రద్దీ కారణంగా భీమవరం, ఏలూరు, విజయవాడ వంటి నగరాల్లో హోటల్ గదులు దొరకడమే కష్టంగా మారిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల గది అద్దె రోజుకు 30 వేల రూపాయల వరకు పలుకుతోందంటే పందాల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. సంప్రదాయం పేరిట జరుగుతున్న ఈ క్రీడలో పాల్గొనేందుకు వేలాది మంది తరలిరావడంతో ఏపీ రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
కోడి కత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ, పందెం రాయుళ్లు మాత్రం కోడి కత్తి కట్టందే పండుగ పూర్తి కాదని భీష్మించుకుని కూర్చున్నారని తెలియవస్తోంది. ఏది ఏమైనప్పటికీ పండగ అంటే కోడి పందాలే కాదు కుటుంబ సభ్యులు, పాడి పశువులతో జరుపుకునే సంబరాలని కూడా పెద్దలు చెబుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV