
అమరావతి, 15 జనవరి (హి.స.)
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల 24 గంటల హైడ్రామాకు తెర పడింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, దాసరి సుధీర్‌కు బెయిల్ మంజూరైంది. ఇద్దరి పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇద్దరికీ రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. కోర్టు తీర్పుతో సీసీఎస్ పోలీసులు తలదించుకుని వెళ్లిపోయారు.
ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ (52), రిపోర్టర్ దాసరి సుధీర్ (39)ల రిమాండ్‌ను నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. బాధితుల పేర్లు, వాంగ్మూలాలు లేవని కోర్టుకు పోలీసులు చెప్పారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి బాధితులు ఇష్టపడలేదని పోలీసులు వివరించారు. సీసీఎస్ పోలీసుల వాదనను నాంపల్లి కోర్టు తప్పుబట్టింది. ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అక్రమం అని తేలిపోయిందని జర్నలిస్ట్ సంఘాలు పేర్కొన్నాయి. విచారణ పేరుతో బుధవారం సీసీఎస్ పోలీసులు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ