
అమరావతి, 15 జనవరి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో జరపుకునే అతి పెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగను ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఘడియలతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే సంక్రాంతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటల ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రకృతి, వ్యవసాయం, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఈ పండుగ. గ్రామాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ సందడిని మరింత పెంచేసింది. హరిదాసుల కీర్తనలు, భజనలు గ్రామాల వీధుల్లో మార్మోగుతున్నాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ