
హైదరాబాద్, 15 జనవరి (హి.స.)
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది. గత నెల రోజులుగా ప్రజలను గజగజ వణికించిన తీవ్రమైన చలి ఒక్కసారిగా తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
సాధారణంగా మహాశివరాత్రి వరకు కొనసాగాల్సిన చలికాలం.. ఈసారి సంక్రాంతికి ముందే వీడ్కోలు పలకడం విశేషంగా మారింది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఇంకా మంచు కురుస్తున్నా.. పగటిపూట మాత్రం ఎండ తీవ్రత పెరుగుతోందని భావిస్తున్నారు.
కాగా కొన్ని రోజుల క్రితం వరకు ఎముకలు కొరికిన చలిగాలుల స్థానంలో ఇప్పుడు వెచ్చని గాలులు వీస్తున్నాయి. నేడు, రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..