
ఢిల్లీ,15, జనవరి (హి.స.)
గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక రిపోర్టు బయటకు వచ్చింది. జుబీన్ గార్గ్ హత్యకు గురి కాలేదని సింగపూర్ పోలీసులు తేల్చారు. ఈ మేరకు కీలక నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఆయన్ను నీటిలో తోసేసినట్లుగానీ.. ఆత్మహత్య చేసుకున్నట్లుగానీ ఎక్కడా ఆధారాలు కనిపించలేదని తేల్చింది. జుబీన్ గార్గ్ మద్యం మత్తులో ఉన్నారని.. లైఫ్ జాకెట్ ధరించేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి అందజేసినట్లు సింగపూర్ మీడియా వెల్లడించింది.
‘‘నీటిలో ఈత కొట్టిన తర్వాత నౌకలోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని సాక్షులు చూశారు. అస్వస్థతకు గురైనట్లు గుర్తించి వెంటనే నౌకలోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధి ఉందని తేలింది’’ అని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు, బోట్ కెప్టెన్, వైద్య సిబ్బంది సహా మొత్తం 35 మందిని విచారించామని, జుబీన్ గార్గ్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ