
తిరుపతి, 16 జనవరి (హి.స.) తిరుపతిలో గోదా కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో ఈ వేడుక కనులపండువగా సాగింది. కల్యాణాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. తొలుత శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కీర్తనలు ఆలపించారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం ముగిసింది. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్‌వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ