
అమరావతి, 16 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్లోబల్ హబ్‍గా మారబోతోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రాబోతోందని దీంతో 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయని తెలిపారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు దీనిపై అత్యంత కీలకమైన ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ రంగంలో సౌదీ అరేబియాకు సమానంగా ఎదిగే దిశగా మరో కీలక ముందడుగు పడబోతోందని కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ కు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయనున్నట్లు ఎక్స్ పోస్టులో ప్రకటించారు.
నిజానికి రేపు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ రూరల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీని వారిద్దరూ కలిసి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు ముందు ఇవాళ సాయంత్రం కీలక ప్రకటన ఉంటుందని లోకేశ్ చేసిన అనౌన్స్ రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. లోకేశ్ ప్రకటనలో మరిన్ని దేశీ-విదేశీ కంపెనీల భాగస్వామ్యం, కొత్త ఎంఓయూలు, రాబోయే ఐదేళ్లలో ఏపీని ఇంధన ఎగుమతిదారుగా ఎలా మార్చబోతున్నారనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV