
కోల్‌కతా, 18,జనవరి (హి.స.) దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను రక్షించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను అభ్యర్థించారు. కలకత్తా హైకోర్టు జల్‌పాయిగుడి సర్క్యూట్ బెంచి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ మాటలన్నారు. దర్యాప్తు సంస్థలు దేశ ప్రజానీకం పట్ల తప్పుగా వ్యవహరించకుండా రక్షణ కల్పించాలని మమత సీజేఐని కోరారు. ‘‘దయచేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను, చరిత్రను, భౌగోళికాన్ని, దేశ సరిహద్దులను వినాశనం నుంచి రక్షించండి’’ అని సీజేఐకి మమత విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు రాజ్యాంగ పరిరక్షకులు. మేం న్యాయపరంగా మీ సంరక్షణలో ఉన్నాం. న్యాయవ్యవస్థలో మిమ్మల్ని మించినవారు ఎవరూ లేరు. కుల, మతాల ప్రాతిపదికన వివక్ష ఉండరాదని దేశ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్య సాధన కోసం పనిచేద్దాం, మాట్లాడదాం, ఆలోచిద్దాం’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, పలువురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ