
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
హైదరాబాద్ నగరంలో చైనా మంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధం ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా చైనా మంజాను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ముఖ్యంగా మేడలు, అపార్ట్మెంట్లపై నుంచి పతంగులు ఎగరవేస్తున్న సమయంలో తెగిపోయిన మంజా రోడ్లపై వేలాడుతూ ద్విచక్ర వాహనదారులకు మృత్యుపాశంగా మారుతోంది. వాహన వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ పోలీసులు అమలు చేస్తున్న వినూత్న ప్రయోగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లో ద్విచక్ర వాహనదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బైక్, స్కూటర్ హ్యాండిల్ వద్ద మెటల్ 'స్ట్రింగ్ ప్రొటెక్టర్' ఏర్పాటు చేశారు. రోడ్డు మీద వేలాడుతున్న మంజా వాహనానికి తగిలిన వెంటనే అది ఆ గార్డ్లోకి చుట్టుకొని పోతుంది. దీంతో మంజా నేరుగా రైడర్ మెడకు లేదా ముఖానికి తగలకుండా ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. ఇప్పుడు ఇదే తరహా 'జుగాడ్'ను హైదాబాద్ లోనూ అమలు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చైనా మంజాను పూర్తిగా నిర్మూలించలేకపోతే, కనీసం ప్రాణాలను కాపాడే చర్యలు అయినా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు