
విజయవాడ:, 03 జనవరి (హి.స.)మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య, అనిల్ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్, రోణక్ కుమార్‌ను పోలీసులు ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వారికి 16వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతి నేపథ్యంలో రిమాండ్ పొడిగింపుపై కొద్దిసేపు చర్చ జరిగింది. తొలుత 12వ తేదీ వరకు రిమాండ్ విధించాలని భావించారు. ఆ తేదీకి పది రోజుల మాత్రమే వస్తున్నాయని ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలిపింది. దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు మాత్రం 14వ తేదీకి వాయిదా వేయాలని కోరారు.
ఆ రోజు సెలవు వచ్చే అవకాశం ఉందని డిఫెన్స్ న్యాయవాదులు తెలిపారు. సంక్రాంతి సెలవులు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేనందున 16 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ 16వ తేదీన సెలవు అయితే 19న నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. నిందితుడు బూనేటి చాణక్య తరఫున న్యాయవాది సుందర్ వాదనలు వినిపించారు. రిమాండ్ పొడిగింపు రిపోర్టులో నిందితులందరికి కలిపి ఒకే విషయాన్ని రాస్తున్నారని తెలిపారు. చాణక్య రిపోర్టులో సిట్ రాసిన ఐదో పేరాతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ రిపోర్టు చాణక్యకు వర్తించదని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ