
హైదరాబాద్, 03 జనవరి (హి.స.) సిఎం రేవంత్ రెడ్డికి ప్రజల
మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కేపీ వివకానంద గౌడ్ విమర్శించారు. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి అయిపోయిందని విమర్శించారు.
జీహెచ్ఎంసీ విభజనపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం గొంతెత్తుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపారని అన్నారు. కుక్కలు చించిన విస్తరిలా హైదరాబాద్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేరని అన్నారు. జీహెచ్ఎంసీ విభజనపై మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లను కూడా కనీసం సంప్రదించలేదని.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా దీనిపై సమగ్ర చర్చ జరగలేదని తెలిపారు. దొంగచాటున హైదరాబాద్ మహానగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు