
అమరావతి, 03 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) హర్షం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర ఆరంభంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంచేలా ప్రవేశపెట్టిన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) కార్యక్రమం, పారదర్శకమైన విధానాలు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల పంపిణీలో జాప్యం లేకుండా, పారదర్శకత కోసం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ఎస్క్రో ఆధారిత మెకానిజం' (Escrow-based mechanism) ద్వారా పెట్టుబడిదారులకు భరోసా లభిస్తోందన్నారు. దీనివల్ల నిర్ణీత సమయంలోనే ప్రోత్సాహకాలు నేరుగా అందుతాయని సీఎం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV