
అమరావతి , 10 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన ఓటర్ల పేర్లను మరోసారి ధ్రువీకరించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించని వారు, చిరునామాల్లో అందుబాటులో లేని ఓటర్లు, ఇతర కారణాలతో ధ్రువీకరణ అవసరమైన వారి వివరాలను పరిశీలించేందుకు ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచనల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. గతంలో నిర్వహించిన గణన సమయంలో చిరునామాల్లో కనిపించని 44.89 లక్షల మందికి పైగా ఓటర్లు, నోటీసుల ప్రక్రియలో అర్హతపై పరిశీలన అవసరమైన మరో 1.73 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాలను మళ్లీ ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.
ఒక వ్యక్తి తాత్కాలికంగా ఇంట్లో లేకపోవడం, ఉద్యోగం లేదా చదువు కోసం మరో ప్రాంతానికి వెళ్లడం వంటి కారణాల వల్ల ఆయన పేరు తొలగించబడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్నవారు వంటి సందర్భాలను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించాలి. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున జాబితాలో లేకపోతే ఫారం-6 ద్వారా నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. యువత, తొలిసారి ఓటు హక్కు పొందుతున్నవారు, చిరునామా మారినవారు తమ వివరాలను పరిశీలించుకోవడం అవసరం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్