
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఆధ్యాత్మిక శోభ మొదలైంది. రాష్ట్రంలో వినాయక నవరాత్రి పూజలు, నిమజ్జనం ముగిశాక ఇక ఇప్పుడు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలు, కాలనీల్లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆదివారం ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని వివిధ గ్రామాల్లో మండపాల నిర్వాహకులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకురాగా మంగళ హారతులు, డప్పు చప్పుళ్లు, భక్తుల జై భవాని ధ్వానాల మధ్య భక్తులు ఊరేగింపుగా మండపాలకు తీసుకువచ్చి ప్రతిష్టాపించారు.
ముందుగా కుంకుమ పూజ, కలశ పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని తర్లపాడు శ్రీ ఓంకారేశ్వర ఆలయ అర్చకులు తెలిపారు.
అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో మాలధారణ ధరించి దీక్ష తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో పూజలు చేస్తామని భక్తులు తెలిపారు.అమ్మవారి రాకతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొనగా యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. తొమ్మిది రోజులు - తొమ్మిది అవతారాలుబాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణా దేవి, లలితా త్రిపుర సుందరి, సరస్వతీ దేవి, మహాలక్ష్మీ దేవి, దుర్గా దేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు