
హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
జిల్లా సాధన కోసం ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు కలిసి చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ జిల్లా ఏర్పాటుపై సానుకూలంగా స్పందించలేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయడం సాధ్యం కావడం లేదని, ప్రజలకు క్షమాపణలు కోరుతూ కేటీఆర్ అప్పట్లో బహిరంగ లేఖ రాశారని గుర్తుచేశారు.
నాటి పరిణామాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఏర్పాటు కోసం స్థానిక ప్రజలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..